మంత్రి కేటీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్...
X
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. ఒకవేళ పోటీ చేసే దమ్ముంటే తెలంగాణ తల్లి విగ్రహం మీద ఒట్టేసి చెప్పాలని మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. మద్యం, డబ్బు పంచకుండా పోటీచేసే ధైర్యం తనకు ఉందని.. అదే ధైర్యం కేటీఆర్కు ఉందా అని అడిగారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ ఓట్లు అడగదని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు లేని గ్రామాల్లో బీఆర్ఎస్ ఓట్లు అడగకుండా ఉంటుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం కాదని.. ప్రజాసేవే ప్రధానమన్నారు. తనకు వయస్సు అయిపోయిందని.. చావుకు దగ్గరయ్యానని వ్యాఖ్యానించారు. 40ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నట్లు తెలిపిన ఆయన.. తన చివరి శ్వాస వరకు ప్రజాసేవకే కట్టుబడి ఉంటానని చెప్పారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనుకున్న యువతకు నిరాశే ఎదురైందన్నారు.