45 రోజుల్లో అసెంబ్లీ రద్దవుతుంది.. సిద్ధంగా ఉండండి : కోమటిరెడ్డి
X
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న 45రోజుల్లో అసెంబ్లీ రద్దు అవుతుందని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలని కోరారు. ఎటువంటి గ్రూప్ రాజకీయాలు చేయొద్దని సూచించారు. గతంలో పీసీసీ చీఫ్ పదవి రాకపోవడంతో కొన్ని రోజులు బాధపడ్డ మాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ లోనూ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని కోమటిరెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్‌లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, జగదీష్ రెడ్డి కడుపులో కత్తులు పెట్టి పొడుచుకోవడానికి సిద్దంగా ఉన్నారని ఆరోపించారు. నియోజకవర్గాల్లో ఇద్దరు సమాన స్థాయి నాయకులు ఉంటే.. ఒకరికి ఎమ్మెల్యే టికెట్.. మరొకరికి ఎమ్మెల్సీ లేదా జెడ్పీ చైర్మన్ ఇప్పించే బాధ్యత పార్టీ సీనియర్ నేతగా తాను తీసుకుంటానని చెప్పారు.
ఏపీలో పార్టీని త్యాగం చేసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని కోమటిరెడ్డి అన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మేలు కోసం ఏపీలో కాంగ్రెస్ నష్టపోయిందని చెప్పారు. అయితే తెలంగాణ వచ్చాక ప్రజల ఆశలు నెరవేరలేదన్నారు. పదో తేదీ వచ్చిన ఉద్యోగులకు జీతాలు రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.