బీఆర్ఎస్లో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
X
నల్గొండ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది. ఎట్టకేలకు ఈ ప్రచారంపై ఉత్తమ్ స్పందించారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని అన్నారు. ఇదంతా ఇంటి దొంగల పనే అని ఆరోపించారు. తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకే ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు
‘‘నేను గత 30ఏళ్లుగా ఎన్నికల్లో ఓటమి లేకుండా గెలుస్తున్నాను. 5సార్లు ఎమ్మెల్యే, ఓ సారి ఎంపీగా గెలిచాను. కానీ గత రెండేళ్లుగా నేను, నా సతీమణి పార్టీ మారుతున్నట్లుగా అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఓ కాంగ్రెస్ నాయకుడితో సంబంధమున్న యూట్యూబ్ ఛానెల్స్, మీడియా సంస్థలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. నాకు బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎటుంటి ఒప్పందాలు లేవు. నేను పార్టీలో కొన్ని సమస్యల పట్ల అసంతృప్తిగా వుండొచ్చు. కానీ పార్టీకి సంబంధించిన విధి విధానాలను అనుసరిస్తున్నాను’’ అని ఉత్తమ్ అన్నారు.
కాగా ఉత్తమ్ తన సతీమణితో కలిసి బీఆర్ఎస్ కండు కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరిగింది. అందులోభాగంగానే భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ముందుగా బీఆర్ఎస్లోకి పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలో కూడా పలుమార్లు ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఉత్తమ్ ఇచ్చిన క్లారిటీతో.. ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారానికి తెరపడుతుందో లేదో చూడాలి.