అభ్యర్థుల ఎంపికలో కొత్త ట్రెండ్.. కాంగ్రెస్ ప్లాన్ మామూలుగా లేదుగా..
X
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే టికెట్ కోసం అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. నిర్దేశిత ఫీజు చెల్లించిన వారికి ధరఖాస్తులు ఇచ్చి వాటిని పరిశీలించిన అనంతరం టికెట్ కన్ఫామ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయింపు ప్రక్రియను మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 25 తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్టు చెప్పింది. ఇందుకోసం ఫీజు కూడా ఖరారు చేసింది. బీసీ అభ్యర్థులు రూ. 25 వేలు, ఓసీ క్యాండిడేట్లు రూ.50 వేలు దరఖాస్తు ఫీజు కింద చెల్లించాలని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. అభ్యర్థులు అప్లికేషన్ తో పాటు ప్రమాణ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుందని కాంగ్రెస్ నాయకత్వం తేల్చి చెప్పింది.
గాంధీ భవన్ లో అందుబాటులో ఉంచిన 4 పేజీల అప్లికేషన్ లో అభ్యర్థి వ్యక్తిగత వివరాలతో పాటు పార్టీలో ప్రస్తుత హోదా, గతంలో పార్టీకి చేసిన సేవ, పొందిన పదవులు, ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, గెలుపు ఓటములు, సోషల్ మీడియా కార్యకలాపాలు, పోటీ చేయదలచిన సెగ్మెంట్‌తో పాటు క్రిమినల్ కేసులు, కోర్టు శిక్షలు తదితర వివరాలు దరఖాస్తులో తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించిన అనంతరం కేరళ ఎంపీ మురళీధరన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీకి అప్పగించనుంది. అభ్యర్థులతో నేరుగా మాట్లాడటంతో పాటు నియోజకవర్గాలవారీగా సర్వే వివరాల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపి సెప్టెంబర్ లో తొలి జాబితా విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.