రెండో విడత బస్సు యాత్రకు సిద్ధం.. పాల్గొననున్న ప్రియాంక, రాహుల్ గాంధీ
X
కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28 నుంచి నవంబర్ 1 వరకు రెండో విడత బస్సు యాత్ర జరగనుంది. 4 ఉమ్మడి జిల్లాల్లో బస్సు యాత్ర సాగేలా తెలంగాణ పీసీసీ ప్లాన్ చేసింది. ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో టూర్ సాగనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్దరామయ్య బస్సు యాత్రలో పాల్గొంటారు. అక్టోబర్ 28, 29 తేదీల్లో సిద్దరామయ్య, 30, 31 తేదీల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ బస్సు యాత్రలో పాల్గొంటారు. నవంబర్ 1న రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టును బుధవారం ప్రకటించే అవకాశముంది. ఢిల్లీలో వరుసగా రెండు రోజులు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. మొదటి జాబితాలో 55 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన 64 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 25న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఫైనల్ అయినప్పటికీ.. సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదని వార్తలు వస్తున్నాయి. అయితే లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. బుధవారం ఈ అంశంపైనా స్పష్టత వచ్చే అవకాశముంది.