Nerella Incident: తెరపైకి నేరెళ్ల 'థర్డ్ డిగ్రీ' ఘటన.. కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్
X
ఏడేండ్ల కిందట తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ల ఘటన.. మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన ఈ ఉదంతంపై.. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసు అధికారులను.. వారి చేసిన తప్పుకు కోర్టు ఎదుట దోషులుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నదన్న వార్తలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి.
అసలేం జరిగిందంటే..
2017, జులై 2న తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఇసుక లారీ ఢీకొని నేరెళ్లకు చెందిన దళితుడు భూమయ్య చనిపోగా.. స్థానికులు ఆగ్రహానికి గురై ఐదు ఇసుక లారీలను తగులబెట్టారు. దీంతో వారిలో 8 మందిని రాత్రికి రాత్రి అదుపులోకి తీసుకొని చట్టవ్యతిరేకంగా తమ ఆధీనంలో ఉంచుకొని థర్డ్ డిగ్రి ఇచ్చారు. దీంతో వారు తీవ్ర గాయాల పాలై.. సంసారాలకు కూడా పనికి రాకుండా పోయారు. మానవత్వం మరిచి.. సిరిసిల్ల పోలీసులు అప్పుడు వ్యవహరించిన తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ఆనాటి ప్రతిపక్షాలు, సామాజిక వేత్తలు ఇంకా పలువురు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్పటి తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఘటనకు కారణమైన సీసీఎస్ ఎస్సై రవీందర్‌ను సస్పెండ్ చేయగా.. ఎస్పీ విశ్వజిత్ కాంపాటి హైదరాబాద్‌కు బదిలీ చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే , ఆనాటి రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం బాధితులను పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో నలుగురు బాధితులు సరెండర్ కాగా.. మిగితా నలుగురు న్యాయపోరాటం చేస్తున్నారు.
సీఎంని కలిసిన బాధితులు
ఆనాడు సరెండర్ అయిన బాధితులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి నష్టపరిహారం అందకపోవడంతో.. బాధితులంతా ఒక్కతాటిపైకి వస్తున్నారు. తమపై థర్డ్ డిగ్రి ప్రయోగించిన పోలీసులపై చట్ట రీత్యా చర్యలు తీసుకునేందుకు ముందుకెళ్తున్నారు. కోర్టులో నిరూపించేందకు అన్ని ఆధారాలు మందుంచుతున్నారు. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. సిరిసిల్లలోని కాంగ్రెస్ నేతలు నేరెళ్ల బాధితులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రికి తమ దుస్థితిని వివరించడంతో... అందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టా రిత్యా చర్యలు తీసుకోనేందుకు అధికార పార్టీ ప్రణాళికలను సిద్దం చేసినట్లు తెలిసింది.
మాజీ మంత్రి జీవితంలో మాయని మచ్చ
ఈ కేసులో పోలీసులు దోషులుగా కోర్టు బోనులో నిలబడనున్నారు. వారు చేసిన తప్పు నిరూపణ అయితే జైలు ఊచలు లెక్కించడం ఖాయం. థర్డ్ డిగ్రిలో ఐపీఎస్ విశ్వజిత్ కంపాటి నేరుగా పాల్గొని తప్పు చేశాడని పోలీస్ శాఖలో కొందరు చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ జీవితానికి ఎస్పి విశ్వజిత్ మాయని మచ్చ తీసుకొచ్చారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా తప్పు చేసిన పోలీసులకు శిక్ష పడితేనే కోర్టులపై ప్రజలకు నమ్మకం కుదురుతుందని సామాన్యులు భావిస్తున్నారు. తద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుందని, మానవ హక్కులు పరిరక్షించబడతాయని అభిప్రాయపడుతున్నారు.