బీఆర్ఎస్ సర్కారు అప్పుల లెక్కలు సభలో బయటపెడ్తాం - షబ్బీర్ అలీ
X
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. గాంధీభవన్‌లో జరిగిన ఈ భేటీ ఐదు అంశాలు ఎజెండాగా కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పీఏసీలో ప్రధానంగా చర్చించారు. నమ్మకంతో అధికారం అప్పగించిన తెలంగాణ ప్రజలకు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చించిన పీఏసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీర్మానించినట్లు పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ వెల్లడించారు. గతంలో ఇందిరా గాంధీ మెదక్ స్థానం నుంచి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. మిగిలిన 4 గ్యారంటీలు అమలుపై పీఏసీలో చర్చించామని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను అసెంబ్లీ వేదికగా వివరిస్తామని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్ ఇస్తారని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో వివరిస్తారని అన్నారు.
త్వరలోనే గ్రామసభలు నిర్వహించి అర్హులందరికీ రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని షబ్బీర్ అలీ ప్రకటించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, ప్రతి పార్లమెంటు సెగ్మెంట్కు ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తామని షబ్బీర్ అలీ స్పష్టంచేశారు.