సోమవారం నుంచి స్క్రూటినీ.. 119 సీట్లకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే..?
X
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న కాంగ్రెస్ ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. గాంధీభవన్కు అప్లికేషన్లు వెల్లువలా వచ్చిపడ్డాయి. 119 నియోజకవర్గాలకుగానూ ఊహించని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. ఒక్క సీటుకు సగటున 9 నుంచి 10 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారంతో దరఖాస్తుల దాఖలు గడువు ముగియగా.. 119 టికెట్ల కోసం 1,020 మంది అప్లై చేసుకున్నారు. ఇల్లందు అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ కోసం అత్యధిక దరఖాస్తులు రాగా.. అత్యల్పంగా కొడంగల్ కోసం వచ్చాయి.
అసెంబ్లీ టికెట్ కేటాయింపు కోసం కొత్త పద్దతి అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ ఆగస్టు 18 నుంచి అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభించింది. ఆగస్టు 25తో గడువు ముగియగా భారీ సంఖ్యలో అభ్యర్థులు టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల సొంత కుటుంబ సభ్యులే ఇద్దరు, ముగ్గురు దరఖాస్తు చేశారు. నాగార్జున సాగర్ టిక్కెట్ కోసం జానారెడ్డి ఇద్దరు కొడుకులు రఘువీర్ రెడ్డి , జై వీర్ రెడ్డి దరఖాస్తు చేయగా, కరీంనగర్ టికెట్ కోసం కేసీఆర్ అన్న రంగారావు కూతురు రమ్యా రావు , ఆమె కొడుకు రితేష్ రావు అప్లై చేసుకున్నారు. ముషీరాబాద్ టిక్కెట్ కోసం అంజన్ కుమార్ యాదవ్ తో పాటు ఆయన కొడుకు అనిల్ కుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. ఆందోల్ నుంచి దామోదర రాజనర్సింహ, ఆయన కూతురు త్రిశాల అప్లికేషన్ సమర్పించారు. ఇలా చాలా చోట్ల కుటుంబసభ్యులే దరఖాస్తు చేయడం విశేషం.
ఇదిలా ఉంటే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అప్లికేషన్లు అన్నింటినీ సోమవారం టీపీసీసీ ఎలక్షన్ కమిటీ ముందు ఉంచనున్నారు. కమిటీ సభ్యులు వాటిని స్క్రూటినీ చేసిన అనంతరం అర్హులైన అభ్యర్థుల పేర్లు ప్రతిపాదించనుంది. అలా ఎంపికైన క్యాండిడేట్ల నుంచి బరిలో దిగే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.