బస్సు యాత్రకు ముందే అభ్యర్థుల ప్రకటన : మురళీధరన్
X
కాంగ్రెస్లో సీనియర్ నేత పొన్నాల రాజీనామా అంశంపై ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొన్నాల రాజీనామాపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. లిస్ట్ రాకముందే పొన్నాల అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్లోకి చాలామంది వస్తున్నారని.. ఒకరిద్దరు వెళ్లిపోయినా తాము బాధపడమని చెప్పారు. టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.
60 నంచి 70 స్థానాల్లో అభ్యర్థుల జాబితా రెడీ అయ్యిందని మురళీధరన్ చెప్పారు. పొత్తు పార్టీలతో చర్చించాక పూర్తి జాబితా ప్రకటిస్తామన్నారు. బస్సు యాత్రకు ముందే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. గెలుపు అవకాశం, విశ్వసనీయత ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ఈ నెల 15 లేదా 16న కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తమకు బెర్తులు దక్కుతాయో లేదో అని ఆశవాహులు వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తే ప్రచారానికి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అయితే దరఖాస్తులు పెద్దఎత్తున రావడం, వలస నేతలకు టికెట్లు, బీసీ టికెట్ల అంశం వంటివి అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేస్తున్నాయని అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో ఫస్ట్ లిస్ట్ రానుండడంతో ఎవరికి చేయి, ఎవరికి మొండిచెయి అన్నది చూడాలి.