Home > తెలంగాణ > కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి రాజీనామా
X

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి తన పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్నా ఆయన పదవి నుంచి వైదొలిగారు. ఈ ఏడాది జనవరిలో మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకాలం హస్తినలో రాష్ట్ర ప్రభుత్వ పనులు, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా వ్యవహరించారు.

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ స్థానం నుంచి బరిలో దిగాలని మల్లు రవి భావిస్తున్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు సైతం తనకు అనుకూలంగానే ఉన్నారని ఆయన పలుమార్లు చెప్పారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. నిజానికి పార్టీ అధిష్టానం వద్ద మల్లు రవికి మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ పై ధీమాతో ఉన్న ఆయన.. అందుకు తగ్గట్లుగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ కారణంగానే మల్లు రవిని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించినట్లు ప్రచారం సాగుతోంది. కాలం కలిసొచ్చి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ప్రస్తుతం నాగర్ కర్నూర్ పార్లమెంట్‌ పరిధిలో 5 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందినవారే ఉన్నారు. దీంతో గెలుపు నల్లేరుపై నడకేనని రవి ధీమాతో ఉన్నారు. నాగర్‌కర్నూల్‌ లోక్ సభ సెగ్మెంట్లో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన క్యాడర్‌తో పాటు బలమైన అనుచర వర్గం ఉంది.

నాగర్‌ కర్నూల్‌ నుంచి 1991, 1998లో రెండు పర్యాయాలు మల్లు రవి ఎంపీగా గెలిచారు. గతంలో 2004 - 2008 వరకు ఏఐసీసీ సభ్యుడిగా వ్యవహరించారు. వైఎస్‌ హయాంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు పనిచేశారు. ఏఐసీసీ, యూత్‌ కాంగ్రెస్లోనూ ఆయన పలు పదవులు నిర్వహించారు. ఉన్నత విద్యావంతుడైన మల్లుకు నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్ పరిధిలోని సమస్యలపై అవగాహన ఉంది.


Updated : 23 Feb 2024 7:50 PM IST
Tags:    
Next Story
Share it
Top