Home > తెలంగాణ > టైమ్స్ నౌ- మాట్రిజ్ సర్వే.. తెలంగాణలో మెజార్టీ సీట్లు ఎవరికంటే..?

టైమ్స్ నౌ- మాట్రిజ్ సర్వే.. తెలంగాణలో మెజార్టీ సీట్లు ఎవరికంటే..?

టైమ్స్ నౌ- మాట్రిజ్ సర్వే.. తెలంగాణలో మెజార్టీ సీట్లు ఎవరికంటే..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్‌కు పార్లమెంటు ఎన్నికల్లోనూ పరాభవం తప్పేట్లు కనిపించడం లేదు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటామని చెపుతున్నా పరిస్థితులు మాత్రం అలా కనిపించడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీయే పార్లమెంటు బరిలోనూ సత్తా చాటుతుందని టైమ్స్ నౌ - మాట్రిజ్ ఎన్‌సీ సర్వే చెబుతోంది.

ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కొల్లగొడుతుందని టైమ్స్ నౌ - మాట్రిజ్ ఎన్సీ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్‌కు కేవలం 2 సీట్లు, బీజేపీకి 5 సీట్లు, ఎంఐఎంకు ఒక సీటు మాత్రమే దక్కుతుందని సర్వేలో తేలింది. ఓట్ల విషయంలోనూ బీఆర్ఎస్ వెనకబడిపోతుందని ఫలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు 40.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్‌కు 28.1 శాతం, బీజేపీకి 22.6 శాతం, ఎంఐఎంకు 3.3 శాతం ఓట్లు వస్తాయని సర్వే స్పష్టం చేసింది. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఓట్ల తేడా కేవలం 5.5 శాతం మాత్రమే కావడం విశేషం. ఒకవేళ ఈ సర్వే ఫలితాలు నిజమైతే బీజేపీకి తెలంగాణలో ఓట్లు భారీగా పెరిగినట్లే అవుతుంది.

2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 9, కాంగ్రెస్‌కు 3, బీజేపీకి 4, ఎంఐఎంకి ఒక సీటు దక్కాయి. బీఆర్ఎస్‌కు 41.7 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 29.7 శాతం ఓట్లు దక్కాయి. టైమ్స్ నౌ-మాట్రిజ్ సర్వే ప్రకారం.. 2019లో వచ్చిన బీఆర్ఎస్‌కు వచ్చిన సీట్లు, ఓట్లు ఈసారి కాంగ్రెస్ ఖాతాలోకి, కాంగ్రెస్‌కు వచ్చిన సీట్లు ఓట్లు బీఆర్ఎస్ ఖాతాలోకి తారుమారు అవుతాయి. ఇక ఏపీ విషయానికొస్తే మొత్తం 25 సీట్లలో వైసీపీకి 19 సీట్లు, టీడీపీ - జనసేన కూటమికి 6 సీట్లు వస్తాయన్నది టైమ్స్ నౌ అంచనా. 2019లో వైసీపీకి 22 సీట్లు, టీడీపీ 3 వచ్చాయి. ఆ లెక్కన చూస్తే ఈసారి జగన్‌కు 3 సీట్లు తగ్గినట్టే.

కేంద్రంలో ఈసారి కూడా మోడీ అధికారంలోకి వస్తారని టైమ్స్ నౌ - మాట్రిజ్ ఎన్‌సీ సర్వే అంచనా వేసింది. మొత్తం 545 సీట్లలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 366 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 104 సీట్లు, ఇతర పార్టీలకు 73 సీట్లు వస్తాయని అంటోంది. 2019 ఎన్నికల్లో ఎన్డీఏకి 353 సీట్లు.. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకి 91 సీట్లు వచ్చాయి.




Updated : 8 Feb 2024 6:06 PM IST
Tags:    
Next Story
Share it
Top