కొత్త ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ శిక్షణా తరగతులు
X
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఒకట్రెండు రోజుల్లో కొత్త సర్కారు కొలువుదీరనుంది. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేల విధులు, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తోంది.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లలో విజయం సాధించింది. ఈసారి ఎన్నికైన 64 మంది ఎమ్మెల్యేల్లో చాలా మంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో వారితో పాటు ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ ప్రజా ప్రతినిధిగా వ్యవహరించాల్సిన తీరు, హక్కులు, బాధ్యతలు, విధులు, అసెంబ్లీ నియమ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నారు. హోటల్ ఎల్లాలో వారికి శిక్షణ ఇస్తున్నారు.
తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినవారు కాంగ్రెస్ లో చాలా మందే ఉన్నారు. అతి చిన్న వయసు ఎమ్మెల్యే కూడా ఆ పార్టీలోనే ఉండటం విశేషం. పాలకుర్తి బరిలో దిగి ఎర్రబెల్లిని మట్టి కరిపించిన యశస్విని రెడ్డి, మెదక్ నుంచి పోటీ చేసిన మైనంపల్లి రోహిత్ రావు, వేములవాడ నుంచి బరిలో దిగిన ఆది శ్రీనివాస్ ,రామగుండంలో మక్కాన్‌సింగ్ రాజ్ ఠాగూర్, చెన్నూరు నుంచి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, కంటోన్మెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్ నుంచి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.
అటు నాగర్‌కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కలకుంట్ల మదన్ మోహన్ రావు, తుంగతుర్తి నుంచి ముందుల సామేల్ ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య, ఖమ్మం ఎంపీగా పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరు నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.