బీఆర్ఎస్ హయాంలో పాతబస్తీలో రూ.25వేల కోట్ల అభివృద్ధి - అక్బరుద్దీన్ ఒవైసీ
X
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్పై విడుదల చేసిన శ్వేతపత్రంలో చాలా అంశాలను ప్రస్తావించలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. విద్యుత్పై చర్చ సందర్భంగా ఆయన పలు అంశాలను సభలో ప్రస్తావించారు. పాతబస్తీలో గత ప్రభుత్వ హయాంలో రూ. 25వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఓల్డ్ సిటీలో ఎన్నో సబ్ స్టేషన్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. పాతబస్తీలో నెలకొన్న సమస్యలను సభలో లేవనెత్తడం తన బాధ్యతన్న అక్బరుద్దీన్.. వాటిని పరిష్కరిస్తారో లేదో ప్రభుత్వ ఇష్టం అని అన్నారు.
చర్చ సందర్భంగా అక్బరుద్దీన్, కాంగ్రెస్ సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఎంఐఎంను రూపుమాపాలని కొన్ని పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఒవైసీ ఆరోపించారు. సభలో ఏడుగురు ఎంఐఎం సభ్యులు మాత్రమే ఉన్నామని, అయినా ఓర్వలేకపోతున్నారని అన్నారు. ముస్లింను అయినందున తాను సభలో సమస్యలు లేవనెత్తకూడదా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
అనంతరం మాట్లాడిన అక్బరుద్దీన్ 24 గంటల నిరంతర విద్యుత్ అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందజేశారని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశ సగటుకన్నా తెలంగాణ ముందుందని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.