Congress Government: డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం - ఉత్తమ్ కుమార్ రెడ్డి
X
కేసీఆర్ సర్కారు అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ఎంపీ ఉత్తర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన ఏ హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హుజుర్ నగర్లో తనకు 50 వేల మెజారిటీ వస్తుందని 6 నెలల క్రితమే చెప్పానని అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలు గెలుస్తుందని, డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలో వచ్చిన వెంటనే 6 గ్యారెంటీలను అమలుచేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 100 గజాల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ఇస్తామని ఉత్తమ్ చెప్పారు. కార్యకర్తలే తన కుటుంబసభ్యులన్న ఆయన.. 24 గంటలు ప్రజల కోసమే పాటుపడుతున్నానని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ ప్రజలు తనను ఆశీర్వదించాలని, వారి నమ్మకాన్ని తాను వమ్ము చేయనని చెప్పారు.