పాలేరు టికెట్ ఆయనకే కన్ఫామ్ చేసిన కాంగ్రెస్.!
X
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా అసంతృప్తులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని ఓ నియోజకవర్గం గురించి ప్రస్తుతం జోరుగా చర్చ సాగుతోంది. అదే ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం.
ఇద్దరు నేతల పోటీ
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ టికెట్ కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ నెలకొంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీనితో పాటు మరో పార్టీ అధ్యక్షురాలు సైతం ఆ సీటును ఆశిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు టికెట్ ఇస్తామన్న హామీతోనే పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్న తుమ్మల నాగేశ్వర్ రావు సైతం పాలేరు నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పాలేరు సీటు కోరిన షర్మిల
ఇదిలా ఉంటే కాంగ్రెస్లో వైఎస్సాఆర్టీపీ వీలినంపై జోరుగా ఊహాగానాలు వినిపించాయి. పాలేరు టికెట్ ఇస్తేనే విలీనానికి అంగీకరిస్తానని ఆ పార్టీ అధినేత్రి షర్మిల తేల్చిచెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు, షర్మిలలో ఎవరిని పాలేరు బరిలో నిలుపుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజా పరిణామాలు గమనిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లు తెలుస్తోంది.
పొంగులేటికి లైన్ క్లియర్
త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్న తుమ్మల నాగేశ్వరరావును పాలేరు బదులు ఖమ్మం నుంచి బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పించినట్లు సమాచారం. మరోవైపు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ మధ్య కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీ విలీనం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తుమ్మల పాలేరు బరి నుంచి తప్పుకోవడం, వైఎస్సాఆర్టీపీ విలీనం వాయిదా పడటంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.