Electric scooty : మరో హామీ అమలు చేయనున్న కాంగ్రెస్..యువతులకు ఫ్రీ స్కూటీ!
X
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలకు ముందు ఆరు హామీ పథకాలను అమలు చేయనున్నట్లు తెలిపింది. అందులో భాగంగా యువతులకు ఉచితంగా స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తాజాగా యువతులకు ఉచితంగా స్కూటర్లను అందించేందుకు సిద్ధమైంది. ఎన్నికలకు ముందు యువ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ఈ స్కీమ్‌ను మేనిఫెస్టోలో చేర్చింది. ఇప్పుడు ఈ పథకాన్ని పార్లమెంట్ ఎన్నికలలోపు ప్రారంభించేందుకు సమాయత్తమైంది.
ఈ పథకం కింద విద్యార్థులకు మాత్రమే ఎలక్ట్రిక్ స్కూటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం అందించనుంది. రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లే బాలికలకు మాత్రమే ఈ స్కీమ్‌ను వర్తింపజేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 18 ఏళ్లపైబడిన వారి సంఖ్యను ప్రస్తుతం కాంగ్రెస్ లెక్కిస్తోంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, మేనేజ్‌మెంట్ కళాశాలల్లో చదువుతున్న యువతులంతా ఈ పథకానికి అర్హులే. రాష్ట్రవ్యాప్తంగా 5279 కళాశాలలు ఉండగా ఇందులో అర్హులకు ఫ్రీ స్కూటీలను ప్రభుత్వం అందించనుంది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే
ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే యువతులు కచ్చితంగా తెలంగాణ పౌరులై ఉండాలి. ఏదైనా కళాశాలలో చదువుతుండాలి. తెలంగాణలో పేద కుటుంబానికి చెంది యువతి అయ్యి ఉండాలి. ఇంటర్ ఉత్తీర్ణురాలై ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం ఉండాలి. అడ్రస్ ప్రూఫ్, కాలేజీ ఐడీ కార్డు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://telangana.gov.inకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.