ఆసరా పింఛన్లలో గోల్‌మాల్.. తేల్చిన కాగ్
X
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మరో బాగోతం బట్టబయలైంది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఆసరా పింఛన్‌లను పంపిణీ చేశారని, గోల్‌మాల్ జరిగిందంటూ కాగ్ తన నివేదికలో వెల్లడించింది. ఆసరా డేటా బేస్, సమగ్ర కుటుంబ సర్వే మధ్య వ్యత్యాసం ఉందని తేల్చింది. 2018-21 మధ్య కాలంలోనే సగటున నెలకు 2.3 లక్షల మందికి చెల్లింపులు జరగలేదని కాగ్ తెలిపింది. కుటుంబ సర్వే ప్రకారం 16 శాతం మందికి అర్హత లేకున్నా పింఛన్‌లు జారీ చేశారని పేర్కోంది. తెలంగాణలో ఇసుక తవ్వకాలపై కాగ్ అక్షింతలు వేసింది. పేరుకే గిరిజన సంఘాలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చారని.. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కాంట్రాక్టులు బదలాయించారని తెలిపింది.
ప్రభుత్వం ఇసుక అక్రమాలను అడ్డుకోలేక పోయిందని పేర్కొన్నాది. ఇసుక తవ్వకాల ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవన్నారు. అధిక లోడ్‌లు వేసి ప్రజాధనానికి నష్టం చేశారని కాగ్ పేర్కొంది. ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ లేదని వెల్లడించింది. అనుమతులు లేకుండా అధిక ఇసుక తవ్వకం, అక్రమ రవాణా జరిగిందన్నారు. పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి చర్యలు లేవని కాగ్ తెలిపింది. ఆసరా పెన్షన్ల అక్రమాలపై కాగ్ నివేదిక అందుకుంది. రెండు లక్షల అనర్హులకు ఆసరా పెన్షన్లు ఇచ్చారని కాగ్ వెల్లడించింది. దానివల్ల 1175 కోట్లు దుర్వినియోగం అయ్యాయని తెలిపింది. సమగ్ర కుటుంబ సర్వేలో 19 శాతం కుటుంబాల సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది. సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే 16% మంది అనర్హులకు ఆసరా పింఛన్లు దక్కాయని తెలిపింది. ఆసరా సాఫ్ట్‌వేర్‌లో అనేక లోపాలు ఉన్నాయని.. నిర్ధిష్ట ఆదాయానికి మించిన ఆదాయం ఉన్న వాళ్లకి కూడా పెన్షన్లు ఇచ్చారని కాగ్ తెలిపింది.