నా కొడుక్కు టికెట్ ఇస్తే ఎన్నికల బరిలో ఉంటాడు.. లేకపోతే.. : గుత్తా
X
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. తన కొడుక్కు పార్టీ అవకాశం ఇస్తే ఎన్నికల బరిలో ఉంటారని చెప్పారు. అవకాశం రాకపోతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలు కేవలం గుర్తింపు వరకు మాత్రమే పనిచేస్తాయని..గెలుపుకు పనికిరావని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గుత్తా అన్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా రాజకీయాల్లో అంతర్గత కలహాలు అనేది సహజమని చెప్పారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందన్నారు. వేముల విరేశం కాంగ్రెస్లోకి వెళ్తారనేది అవాస్తవమన్నారు. కాంగ్రెస్లో చేరుతాం అని చెప్పుకునే ఖమ్మం, మహబూబ్ నగర్ నేతలు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఉహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి మాటలకు అంతూ పొంతు ఉండదని గుత్తా విమర్శించారు. రేవంత్ గతంలో తన రాజీనామా లేఖను స్పీకర్కు ఇవ్వకుండా పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం విడ్డూరమన్నారు. ఫిరాయిపులను ఆపేందుకు చట్టం తేవాల్సిన కేంద్రమే.. వాటిని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందే తప్ప న్యాయం చేయలేదన్నారు. విభజన హామీలు కేంద్రం పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ లేకుండా కూటమి అని కేసీఆర్ అన్నాడు కాబట్టే విపక్ష సమావేశానికి వెళ్లలేదని గుత్తా వివరించారు.