సోనియాతో షర్మిల భేటీ..బయటికి వచ్చి ఏమన్నారంటే
X
ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ నివాసంలో వై.ఎస్.షర్మిల భేటీ ముగిసింది. సోనియా, రాహుల్ ను కలిసిన షర్మిల తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. దీనికి సంబంధించి తుది చర్చలు జరపడానికే ఈ రోజు షర్మిల ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్‌టీపీ నేతలకు గానీ, భద్రతా సిబ్బందికి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఒక్కరే తన భర్తతో కలిసి సోనియా గాంధీని షర్మిల కలిశారు. సమావేశం అనంతరం కేసీఆర్‌పై షర్మిల పంచ్ డైలాగులు పేల్చారు.
" సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిశాను. మా మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయి. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తుంది. కేసీఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది"అని అన్నారు. అయితే సోనియా గాంధీతో భేటీ తర్వాత విలీనంపై స్పష్టత వస్తుందని అంతా భావించినప్పటికీ , పార్టీ విలీనంపై షర్మిల ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. షర్మిల మాత్రం అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.