సొంతూరికి సీసీ రోడ్లు మంజూరైనా పట్టించుకోట్లేదు.. సీపీఐ నారాయణ
X
తన సొంతూరులో రోడ్ల పరిస్థితి బాగాలేదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ జగన్ సర్కార్‌కు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లానగరి మండలంలోని తన స్వగ్రామం అయిన అయనంబాకం గ్రామానికి 4 సంవత్సరాల క్రితమే సీసీ రోడ్లు మంజూరు అయ్యాయన్నారు. రూ. 6 లక్షల నిధులతో రోడ్లు మంజూరైనా.. ఇంకా పనులే మొదలెట్టలేదన్నారు. సంబంధిత వారిని ప్రశ్నిస్తే పనులు చేశాక రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయట్లేదు కాబట్టి తాము రిస్కు తీసుకోమని కాంట్రాక్టర్లు వాపోతున్నారన్నారు. ఈ అంశంపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రానికి లేఖ రాశామన్నారు. దీనిపై స్పందించిన కేంద్రం ప్రభుత్వం.. రోడ్ల పనులు మొదలు పెట్టకపోవడం పై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించిందన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని, కనీసం ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో సిసి రోడ్డు పనులు పూర్తి చేయాలని తాను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు నారాయణ మీడియాకు తెలిపారు.