Home > తెలంగాణ > వాడుకుని వదిలేయడం మామా అల్లుళ్లకు అలవాటే : రేవంత్

వాడుకుని వదిలేయడం మామా అల్లుళ్లకు అలవాటే : రేవంత్

వాడుకుని వదిలేయడం మామా అల్లుళ్లకు అలవాటే : రేవంత్
X

సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మామా అల్లుళ్లకు వాడుకుని వదిలేయడం అలవాటే అని విమర్శించారు. మునుగోడులో కమ్యూనిస్టుల మద్ధతుతో గెలిచిన బీఆర్ఎస్.. ఇప్పుడు సీపీఐ, సీపీఎం ఉచ్చులో ప్రజలు పడొద్దని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీపీఐ, సీపీఎంలకు కార్యకర్తలే లేరని అనడం హరీష్ రావు అహంకారమన్నారు. దీనికి సంబంధించి ఆయన ఓ ట్వీట్ చేశారు.

‘‘ ఏరుదాటాక తెప్ప తగలేయడం మామా అల్లుళ్లకు అలవాటేనని మరో సారి రుజువు చేశారు హరీష్ గారూ. మునుగోడులో కమ్యూనిస్టుల మద్ధతుతో గెలిచి ఇప్పుడు ఎర్రజెండా మోసేటోడే లేడని మాట్లాడుతున్నారు. ఈ ఊసరవెల్లుల గురించి కమ్యూనిష్టు సోదరులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే వారికి, సమాజానికి అంత మంచిది’’ అని రేవంత్ ట్వీట్ చేశారు. దీనికి ‘‘కమ్యూనిస్టులకు కార్యకర్తలే లేరు. జెండాలు మోసేందుకు ఆశాలు, అంగన్వాడీ టీచర్లను వాడుకుంటున్నారు. వాళ్ల ఉచ్చులో ప్రజలు పడొద్దు’’ అని నమస్తే తెలంగాణ పేపర్లో హరీష్ రావు మాట్లాడిన క్లిప్ను జత చేశారు.

కాగా మునుగోడు ఉపఎన్నిక సమయంలో సీపీఐ, సీపీఎంలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. మునుగోడులో ఆ పార్టీలకు మంచి పట్టు ఉండడంతో బీఆర్ఎస్ వాటితో పొత్తుపెట్టుకుని ఉపఎన్నికలో గెలిచిందనే ఆరోపణలున్నాయి. బీజేపీని ఓడించడం కోసం బీఆర్ఎస్తో జతకట్టామని అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రకటించాయి. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరిగింది. తాజాగా మంత్రి హరీష్ రావు కామెంట్స్తో పొత్త లేదని తెలుస్తోంది.

Updated : 24 July 2023 6:33 PM IST
Tags:    
Next Story
Share it
Top