Home > తెలంగాణ > బీజేపీని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉంది

బీజేపీని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉంది

'అధికారం కోసం అడ్డమైన గడ్డి తినే వాళ్లం కాదు'

బీజేపీని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉంది
X



మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం-లో నిర్వహించిన ప్రజాగర్జన బహిరంగ సభలో పాల్గొన్న వారు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా.. ఎన్ని పర్యటనలు చేసినా వామపక్ష ఉద్యమాలకు పెట్టని కోటలాంటి తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని సీపీఐ జాతీయ నేత నారాయణ పేర్కొన్నారు. ఓట్ల పరంగా తమకు బలం తక్కువున్నా.. బీజేపీని ఎదుర్కొనే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. దేశంలో మతం పేరుతో విచ్ఛిన్నశక్తిగా మారిన బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని ఈ సందర్భంగా నారాయణ పిలుపునిచ్చారు.

కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించాలని, దేశవ్యాప్తంగా ఏకమవుతున్న బీజేపీ వ్యతిరేక శక్తుల కూటమితో బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ కలిసిరావాలన్నారు . బయట ఉండి పోరాడితే ఆయన్ను నమ్మాల్సిన అవసరం లేదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను సంపూర్ణంగా నెరవేర్చలేదని, ప్రధాని మోదీ కార్పొరేట్‌ కంపెనీలకు ప్రభుత్వ ఆస్తులను ధారాదత్తం చేస్తూ ఆర్థిక నేరగాళ్లను దత్తపుత్రులుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రం కోసం పోరాడిన సీపీఐకి సీట్లు డిమాండ్‌ చేసే హక్కు ఉందన్నారు. కేసీఆర్‌తో సీట్ల బేరం చేయడం లేదని, రాజకీయ హక్కుగానే సీట్లను కోరుతున్నామని చెప్పా రు.

కమ్యూనిస్టులు అమ్ముడుపోయారని, కమ్యూనిస్టుల పని అయిపోయిందన్న బండి సంజయ్‌ ఆరోపణలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. ఒక్కసారి కొత్తగూడెం వచ్చి చూస్తే కమ్యూనిస్టుల బలం ఏమిటో తెలుస్తుందని చురకలంటించారు. బీజేపీ ఎందులోనూ కమ్యూనిస్టులకు సాటిరాదన్న ఆయన.. ప్రపంచంలో ఎక్కడా ఎర్ర జెండా లేకుండా హక్కులు సాధించుకున్న చరిత్ర లేదన్నారు. నమ్మిన సిద్ధాంతాలను వదలని తమకు బీజేపీ నేతలు నీతులు చెబుతారా అంటూ మండిపడ్డారు. ఆ పార్టీ నేతల మాదిరిగా అధికారం కోసం అడ్డమైన గడ్డి తినడం లేదని విమర్శలు గుప్పించారు. మనుషుల మధ్య విభజన తీసుకువచ్చే సిద్ధాంతాలు బీజేపీవని.. ప్రజల కోసం కమ్యూనిస్టులు ప్రాణాలు త్యాగం చేశారని చెప్పుకొచ్చారు.



Updated : 12 Jun 2023 2:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top