Home > తెలంగాణ > Medaram : జనమయమైన జంపన్న వాగు..కిక్కిరిసిన మేడారం

Medaram : జనమయమైన జంపన్న వాగు..కిక్కిరిసిన మేడారం

Medaram : జనమయమైన జంపన్న వాగు..కిక్కిరిసిన మేడారం
X

మేడారం జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మేడారనికి వస్తున్న భక్తులు మొదలు జంపన్న వాగు వద్ద చేరుకుంటున్నారు. కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి స్నానాలు ఆచరిస్తున్నారు. జంపన్నవాగు పుణ్య స్నానాల అనంతరం అక్కడి నుంచి అమ్మవార్ల దర్శనానికి తరలివెళ్తున్నారు.మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే శుభ గడియలు వచ్చేశాయి. నేడు మేడారం జాతరలో అసలు ఘట్టం ఆవిష్కరణ కానుంది. వనం నుంచి జనంలోకి సమ్మక్క దేవత ఆగమనం కానుంది. చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరణి రూపంలో.. సమ్మక్క దేవతను తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించనున్నారు. తెలంగాణ సర్కార్ తరఫున మంత్రి సీతక్క సమ్మక్క దేవతకు స్వాగతం పలకనున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో.. ఎస్పీ, కలెక్టర్ సమ్మక్కకు స్వాగతం పలకనున్నారు. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ గాల్లో మూడు రౌండ్లు తుపాకీ పేల్చుతారు. గుట్టపై నుంచి సమ్మక్క కిందకు వచ్చే సమయంలో ఆదివాసీ కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు చేయనున్నారు.

అర్ధరాత్రి గద్దెలపై సారలమ్మ కొలువుదీరారు. గద్దెలపై గోవిందరాజు, పగిడిద్దరాజు కొలువుదీరారు. ఇక, మేడారం పరిసరాలు లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాజాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. నాటి నుంచి ప్రజలు ఆ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భక్తజనులు జంపన్నవాగులో పుణ్యస్నానమాచరించి ఆ తర్వాత తల్లుల దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే పూజారులు, పూనుగొండ్ల నుంచి వచ్చే పగిడిద్దరాజు పూజారులు జంపన్నవాగులో దిగి నడుచుకుంటూ వచ్చి గద్దెల ప్రాంగణానికి చేరుకుంటారు. దశాబ్దాలుగా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల దర్శనానికి వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగు వద్ద పార్కింగ్ చేసుకొని ఆర్టీసీ బస్సుల్లో వచ్చి అమ్మవార్లను దర్శించుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఆర్టీసీ బస్సుల దారిలో వీఐపీ వాహనాలను అనుమతించడం వల్ల ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వీవీఐపీలు, వీఐపీల పాసులను కట్టుదిట్టం చేశామని సీతక్క తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గద్దెల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉంటుందని, భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని మంత్రి సీతక్క కోరారు.

Updated : 22 Feb 2024 5:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top