ఎలక్షన్ కమిషన్ పర్యటన.. ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి సమీక్ష
X
కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3న తెలంగాణకు రానుంది. చీఫ్ ఎలక్షన్ కమిషన్తో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు 3 రోజుల పాటు అధికారులు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈసీ అధికారుల రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై ఆమె సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎలక్షన్ కమిషన్ సభ్యులు 3 రోజుల పర్యటనలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని సీఎస్ అధికారులకు చెప్పారు. మరో 2 నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ఎన్నికలకు సంబంధించిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, అధికారులు అన్ని వివరాలను ఒకే పద్ధతిలో అందించాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల వివరాలను అందించాలని, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి వీల్ చైర్‌లు కొనుగోలు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచాలని అన్నారు. ఏఈఆర్‌ఓ/ఈఆర్‌ఓల ఖాళీల భర్తీతో పాటు చెక్‌పోస్టుల వివరాలను కూడా ఈసీ అధికారులకు అందుబాటులో ఉంచాలని శాంతికుమారి ఆదేశించారు.