రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు: సీఎస్ శాంతి కుమారి
X
తెలంగాణలో రానున్న 48 గంటల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అవాంచనీయ ఘటనలు జరుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదావరి బేసిన్ లోని పలు ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. అవి మరింత ఉదృతంగ మారే అవకాశం ఉంది. వీటిపై సమీక్ష జరిపి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమయితే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.