ప్రజాపాలన దరఖాస్తులు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎస్
X
'ప్రజాపాలన' పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రత్యేక కార్యక్రమానికి తొలిరోజు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు సమర్పించారు. రేషన్ కార్డులు లేని వారినుంచి అధికారులు తెల్ల కాగితాలపై వినతిపత్రాలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో 2,88,711, జీహెచ్‌ఎంసీ సహా పట్టణ ప్రాంతాల్లో 4,57,703 దరఖాస్తులు స్వీకరించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ప్రజాపాలన నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రతీ కేంద్రంలోనూ దరఖాస్తు ఫారాలు సరిపడా ఉంచాలని.. ఎవరైనా దరఖాస్తు ఫారాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి వంద మందికో కౌంటర్ ఏర్పాటు చేయాలని.. ఫారాలను నింపడానికి హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగనుంది. గ్రామాలు, వార్డులు, డివిజన్ల వారీగా సభల్ని నిర్వహించనున్నారు. తొలిరోజు ఎక్కువగా చిన్న గ్రామాల్లో సభలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే పట్టణాలు, నగరాల్లో మాత్రం దరఖాస్తు ఫాంలు తక్కువగా వచ్చాయి. కొన్నిచోట్ల సరిపడా అందకపోవడంతో జనాలు ఇబ్బందిపడాల్సి వచ్చింది. దరఖాస్తుల కోసం మీసేవా కేంద్రాలు, జిరాక్స్ సెంటర్ల వద్ద రద్దీ పెరిగింది. కొన్నిచోట్ల దరఖాస్తు ఫాంలను ఎలా నింపాలో అవగాహన లేనివారు అయోమయానికి గురయ్యారు. నిరక్షరాస్యులు ఇబ్బందిపడ్డారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తు ఫాంలు నింపేందుకు డబ్బులు వసూలు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.20 నుంచి రూ.100 వరకు వసూలు చేశారు. చాలామంది జిరాక్స్ దరఖాస్తులలో వివరాలు నింపి ఇస్తే తొలుత వాటిని అంగీకరించలేదు. కానీ తర్వాత స్వీకరించారు. దరఖాస్తులతో పాటు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ బుక్, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డుల జిరాక్స్‌లను కూడా అటాచ్ చేయాల్సి ఉండడంతో ప్రజలు జిరాక్స్, ఆధార్ సెంటర్ల వద్ద బారులు తీరారు. గురువారం సాయంత్రం వరకు ఈ కేంద్రాలు రద్దీగా కన్పించాయి. రేషన్‌కార్డులు లేనివారు.. తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఇప్పటికే రైతుబంధు సొమ్ము, పింఛన్లు పొందుతున్నవారు సైతం.. మళ్లీ దరఖాస్తు చేయాలా అన్న సందేహంతో వచ్చారు. ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు సమర్పించిన వారికి ఇచ్చిన రసీదుల్లో అధికారులు నంబరు రాయలేదు.