CWC MeetingToday : హైదరాబాద్‌లో ‘కాంగ్రెస్’ సందడి.. నేడు, రేపు CWC సమావేశాలు
X
హైదరాబాద్ వేదికగా ఈ రోజు, రేపు 2 రోజులపాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ( Congress Working Committee) సమావేశాలు జరగనున్నాయి. CWC భేటీకి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే తరలిరానున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణాలో ఈ భేటీ జరగనుంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు, లోక్ సభ ఎలక్షన్స్ నేపథ్యంలో భవిష్యత్ వ్యూహం, ఇండియా కూటమిలో భాగస్వామ్యం తదితర అంశాలపై నేతలు చర్చించనున్నారు. రెండో విడత భారత్ జోడో యాత్రపైనా సీడబ్ల్యూసీలో చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల నేపథ్యంలో తాజ్ కృష్ణ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు.
సాధారణంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే CWC సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాంటిది తెలంగాణలో సమావేశంలో నిర్వహిస్తుండటంతో.. అధిష్ఠానం రాష్ట్రానికి ఎంతటి ప్రాధాన్యమిస్తుందో అర్థం చేసుకోవచ్చని సీనియర్ నేతలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అత్యంత ప్రాధాన్యమిస్తుందనే సందేశాన్ని.. ప్రజలకు చెప్పాలనే లక్ష్యంతోనే సీడబ్ల్యూసీ సమావేశాలను తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. సీడబ్ల్యూసీ సభ్యులుగా తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పులరాజుతోపాటు శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహా, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతల హోదాల్లో రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy), భట్టి విక్రమార్క ఈ సమావేశాలకు హాజరవుతారు.
సీడబ్ల్యూసీ మీటింగ్లో భాగంగా తొలిరోజు ఇండియా కూటమిలో భాగస్వామ్యం, తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మిజోరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు లోక్ సభ ఎలక్షన్స్ లేదా జమిలి ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలన్న అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్సుంది. ఇక రెండో రోజు సమావేశాల్లో భాగంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ నెల 18 నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్న క్రమంలో.. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా అగ్రనేతలు చర్చించనున్నట్లు సమాచారం.