Home > తెలంగాణ > సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయి - సీపీ అవినాష్ మహంతి

సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయి - సీపీ అవినాష్ మహంతి

సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయి - సీపీ అవినాష్ మహంతి
X

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే క్రైం రేటు పెరిగిందని సీపీ అవినాష్ మహంతి ప్రకటించారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని చెప్పారు. ఈ మేరకు వార్షిక నేర నివేదికను సీపీ రిలీజ్ చేశారు. 2022లో 4,850 సైబర్ క్రైమ్‌లు కేసులు నమోదుకాగా.. ఈసారి ఆ సంఖ్య 5,342కు చేరిందని అన్నారు. వీటి వల్ల రూ.232 కోట్ల మోసం జరిగిందని చెప్పారు. ఈ ఏడాది 277 డ్రగ్స్ కేసులు నమోదు కాగా.. 567 మందిని అరెస్టు చేసినట్లు అవినాష్ మహంతి ప్రకటించారు. రెండు పీడీ యాక్టులు నమోదు చేశామని అన్నారు. 2023లో రూ.27.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేశామని చెప్పారు. సైబరాబాద్‌లో ఆర్థిక, స్థిరాస్తి నేరాలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయన్న సీపీ.. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది మహిళపై నేరాలు పెరిగాయని అయితే అత్యాచారం కేసులు మాత్రం తగ్గాయని సీపీ అవినాష్ మహంతి అన్నారు. 2022లో 316 అత్యాచారం కేసులు నమోదుకాగా.. ఈసారి 259 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దోపిడీ, చోరీ కేసుల సంఖ్య పెరిగిందని ఈ ఏడాది నమోదైన 52,124 డ్రంక్‌ అండ్ డ్రైవ్ కేసుల్లో 1,271 మందికి శిక్షలు పడ్డాయని అన్నారు.

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని సీపీ చెప్పారు. త్వరలో ఈ కేసు వివరాలు అందిస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కూడా జరుగుతోందని చెప్పారు. సిఫార్సు లేఖలపై పొస్టింగ్‌లు ఉండవని స్పష్టం చేశారు. న్యూ ఇయర్సె లబ్రేషన్స్ నిర్వహించే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్న మహంతి లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.




Updated : 23 Dec 2023 8:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top