CP Avinash Mohanty:రాత్రి 8 నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు.. సైబరాబాద్ సీపీ
X
న్యూ ఇయర్ వేడుకలపై సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కీలక ప్రకటన చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా నూతన సంవత్సర వేడుకలు చేసుకోవాలని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్‌తో ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని కోరారు. డ్రగ్స్ సేవించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయన్నారు. రాత్రి 8 నుంచి ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని స్పష్టం చేశారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా..అన్ని ఫ్లైఓవర్ లు మూసి వేస్తామని స్పష్టం చేశారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు ఓఆర్ఆర్ , కేబుల్ బ్రిడ్జ్ , ఫ్లైఓవర్ ల పైకి వాహనాలు అనుమతించబోమని తెలిపారు. సరైన ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే...ఈవెంట్ నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో పబ్‌ల యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. స్టంట్స్, ఓవర్ స్పీడ్ వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా నగరంలో సైబరాబాద్ పరిధిలో (Traffic Restrictions) ఫైఓవర్లు, రోడ్డు మార్గాలను మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వెళ్లే వాహనాలకు తప్ప ఇతర లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదని వెల్లడించారు. వీటితో పాటు శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, షేక్‌పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జేఎన్‌టీయూ ఫ్లై ఓవర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్, బాలానగర్ ఫ్లైఓవర్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్ వాహనాలు, హెవీ ప్యాసింజర్ వాహనాలను జనవరి 1వ తేదీ తెల్లవారుజాము 5 గంటల వరకు అనుమతించామని పోలీసులు తెలిపారు.