న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై సైబరాబాద్ పోలీసుల ఆంక్షలు
X
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు అవి అమల్లో ఉంటాయని చెప్పారు. పోలీసుల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ ప్రెస్ వే మూసివేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రం అనుమతిస్తామని చెప్పారు. శిల్పా లేఔట్, గచ్చిబౌలి, బయో డైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్ స్పేస్, సైబర్ టవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ ఫ్లై ఓవర్లతో పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు.
మరోవైపు క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని పోలీసులు సూచించారు. ప్రయాణికుల నుంచి ఎక్కువ మొత్తంలో ఛార్జీలు వసూలు చేయవద్దని ఆదేశించారు. మద్యం తాగి వాహనం నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.