Governor Tamilisai : గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
X
తెలంగాణ గవర్నర్ తమిళి సై (Tamilisai Soundararajan) ‘ఎక్స్’ ఖాతా హ్యాక్ విచారణను అధికారులు ముమ్మరం చేశారు. ముంబై నుంచే గవర్నర్ తమిళి సై ‘ఎక్స్ (X)’ ఖాతా హ్యాక్ అయినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అక్కడి ఓ బొటిక్ వైఫై నెట్‌వర్క్‌ను దుండగుడు వినియోగించినట్టు సాంకేతిక ఆధారాల ద్వారా కనిపెట్టారు. సైబర్ క్రైమ్ పోలీసులు.. బొటిక్ సంస్థ నిర్వాహకురాలిని ప్రశ్నించినా వివరాలు తెలియవని చెప్పినట్టుగా సమాచారం. గత కొన్ని రోజులుగా బోటిక్ షాప్ మూసి వేసే ఉన్నట్లు సమాచారం. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు.
గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్(X) హ్యాక్‌కి గురైంది. ఈ నెల 14న ఆమె అకౌంట్ హ్యాక్ అయినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోతాజాగా మూడు ఐపీ అడ్రస్‌లను గుర్తించారు. ఐపీ అడ్రస్‌ల ద్వారా వివరాలు పంపాలని ఆయా సర్వీస్ ప్రొవైడర్లను కోరారు. అలా అందిన సమాచారంతో ముంబై నుంచి ఖాతాను హ్యాక్ చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు.