నాంపల్లి అగ్నిప్రమాదం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
X
హైదరాబాద్‌లోని నాంపల్లిలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. బజార్‌ఘాట్‌లో ఉన్న ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఎగిసిపడ్డ మంటలు ఒక్కసారిగా చెలరేగి పైన ఉన్న నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం కాగా, పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ వెంకటేశ్వర్లు.. ప్రమాదానికి గల కారణాన్ని వివరించారు. సోమవారం ఉదయం 9.45 ని.ల సమయంలో అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ లో కారు గ్యారేజ్ ఉందని, ఉదయం కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయన్నారు. సమీపంలోనే కెమికల్ డ్రమ్ములు ఉండడంతో.. వాటికి మంటలు అంటుకొని ఉవ్వెత్తున ఎగిసి.. అపార్ట్ మెంట్ పై వరకూ వ్యాపించాయన్నారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారని.. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు చెప్పారు.
ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. నిచ్చెనల సహాయంతో భవనంలోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.