Home > తెలంగాణ > Medaram : మేడారంలో షాపుల కూల్చివేత.. వ్యాపారుల ధర్నా

Medaram : మేడారంలో షాపుల కూల్చివేత.. వ్యాపారుల ధర్నా

Medaram : మేడారంలో షాపుల కూల్చివేత.. వ్యాపారుల ధర్నా
X

తెలంగాణ కుంభామేళాకు టైం దగ్గర పడింది. కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతర జరగనుంది. ఈ మహాజాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే మహాజాతర సమీపిస్తున్న వేళా మేడారంలో షాపులను కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో దారికి అడ్డంగా ఉన్నాయంటూ అధికారులు కొన్ని షాపులను కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులు ఎలా కూలుస్తారంటూ వ్యాపారులు మండిపడ్డారు. అంతేగాక అడిషనల్ కలెక్టర్ కారును అడ్డుకుని రాస్తారోకో చేశారు.

ఈ నెల 21 నుంచి 24 వరకూ మేడారం మహాజాతర జరగనుంది. వనదేవతలను దర్శించేందుకు మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు. అమ్మవారికి మొక్కలు చెల్లించుకునేందుకు బారులు తీరారు. దీంతో మేడారం చుట్టు పక్కన ప్రాంతాల్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గద్దెలకు దగ్గరగా ఉన్న ఏరియాలో రోడ్డుపై ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్న షాపులను తొలగించమని ములుగు అడిషనల్ కలెక్టర్ శ్రిజ ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి జేసీబీలతో కొన్ని షాపులను కూల్చేశారు. మరుసటి నాడు మిగతావాటిని కూల్చేందుకు అధికారులు రాగా వ్యాపారులు ధర్నాకు దిగారు. నోటీసులు ఇవ్వకుండా షాపులను కూల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వానలకు షాపులు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అని షాపులు తీసివేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ భూమిలో షెడ్లు ఎలా వేసుకుంటారని ప్రశ్నించిన అధికారులు..భక్తులకు ఇబ్బందులు కలుగవద్దనే ఇలా చేశామని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తమకు ప్రత్యామ్నాయ స్థలం చూపేవరకూ షాపులు కూల్చొద్దని షాపు యజమానులు పట్టుబట్టారు. అయితే అడిషనల్ ఎస్పీ సంకీర్త్ జోక్యం చేసుకుని వ్యాపారులకు సర్ది చెప్పారు. మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. అయితే షెడ్ల కూల్చివేత నిలిచిపోవడంతో వ్యాపారులు నిరసన విరమించారు.

Updated : 11 Feb 2024 9:27 AM IST
Tags:    
Next Story
Share it
Top