స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడం సంతోషకరం.. డిప్యూటీ సీఎం భట్టి
X
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడం సంతోషకరంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అత్యున్నత దేవాలయంగా భావించే అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం చాలా సంతోషమని, ఈ సంప్రదాయాన్ని మున్ముందు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించిన స్వపక్ష, విపక్ష, మిత్రపక్ష సభ్యులందరికీ భట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అపార రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన వ్యక్తి ప్రసాద్ కుమార్ అని, ఆయన స్పీకర్ గా ఎన్నికవ్వడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే చర్చలు అర్ధవంతంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా జరగడానికి స్పీకర్ తమ సలహాలు, సూచనలు మీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని భట్టి కోరారు. కాగా స్పీకర్ ఎన్నికైన ప్రసాద్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విపక్ష నేత కేటీఆర్ స్పీకర్ స్థానంలోకి తీసుకెళ్లారు.