కౌంటింగ్ సెంటర్ల వద్ద భద్రతపై డీజీపీ సమీక్ష
X
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డీజీపీ అంజనీ కుమార్ దిశా నిర్దేశం చేశారు. సీపీలు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును డీజీపీ సమీక్షించారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల బయట పటిష్ఠ నిఘా పెట్టాలని, కేంద్రాల లోపల సైతం దృష్టి సారించాలని అంజనీ కుమార్ అధికారలను సూచించారు. చివరి రౌండ్ల సమయంలో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉన్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయడంతో పాటు పోలీస్ పికెటింగ్, అదనపు బలగాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
విజయోత్సవ ర్యాలీల్లో దాడులు, ప్రతిదాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శని, ఆదివారాలు మరింత అప్రమత్తంగా ఉండి.. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని సీపీలు, ఎస్పీలకు డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు.