సిద్ధిపేటలో డైనోసార్ పార్క్.. ఎన్నో వింతలు, విశేషాలతో..
X
సిద్ధిపేట సరికొత్త అందాలకు వేదికగా మారనుంది. కోమటిచెరువు ఇప్పటికే పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షిస్తుండగా.. ఇప్పుడు మరికొన్ని హంగులను అద్దుకోనుంది. ఇప్పటికే అంతరించిపోయిన డైనోసార్లు అంటే అందరికీ ఆసక్తే. డైనోసార్లపై స్పీల్ బర్గ్ తీసిన జురాసిక్ పార్క్ ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. ఈ ఆసక్తి వల్లే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో డైనోసార్ థీమ్ పార్కులు వెలిశాయి. ఈ డైనోసారి థీమ్ పార్క్ మనకు కూడా అందుబాటులోకి రానుంది.
కోమటిచెరువు సమీపంలో డైనోసార్ పార్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ పార్క్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా, సింగపూర్‌లలోని యూనివర్సల్ వరల్డ్ స్టూడియోలో ఉన్న డైనోపార్క్‌ల తరహాలో ఈ పార్క్ రూపుదిద్దుకుంటుంది. డైనోసార్ పార్క్‌ను 12కోట్లతో 1.5 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఈ పార్క్‌లో పెద్ద గుహలు, కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం, లావా, గ్రీనరీ, వాటర్‌ఫాల్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు.
పార్కులో వివిధ రకాల డైనోసార్‌లు, వాటి గుడ్లు, అస్థిపంజరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిలికాన్ డైనోసార్లను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి పార్కు ఆవరణలో అటూ ఇటూ తిరుగుతూ పెద్ద పెద్ద శబ్దాలతో సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేయనున్నాయి. ఈ డైనో థీమ్ పార్క్‌లో వాకింగ్ డైనోసార్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో చిన్నారులు కూర్చుంటే నడుచుకుంటూ వెళ్తుంది. ఒకేసారి ఆరుగురు చిన్నారులు కూర్చునే విధంగా రూపొందించారు.
పార్క్లోని గుహల్లో తిరుగుతున్న సమయంలో సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. పార్క్‌ను చూసేందుకు వస్తున్న పిల్లలను అలరించేందుకు డైనోసర్ సూట్ వేసుకుని ఇద్దరు వ్యక్తులు సందడి చేయనున్నారు. డైనోసార్ పార్కులో ఉన్న వింతలు విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల మినీ ట్రాక్‌ను నిర్మించారు. దీనిపై ఓపెన్ ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్‌లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగీలో ఆరుగురు కూర్చునే వీలుంది.
ఈ ఓపెన్ ట్రైన్‌లో తిరుగుతున్న సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. డైనోసార్‌లు ఒక్కసారిగా మీదపడినట్టు, భీకరంగా అరవడం లాంటివి చేసేలా డిజైన్ చేశారు. సిద్దిపేటలో ప్రారంభంకాబోతున్న పార్క్‌లో కదిలే డైనోసార్లు 18 ఉండగా.. నిలకడగా ఉండేవి 5 ఉన్నాయి. కాగా దేశంలో ఇదే పెద్ద డైనోసార్ పార్క్ అని పలువురు అంటున్నారు. ఈ పార్క్తో సిద్ధపేటకు పర్యాటకుల తాకిడి పెరగనుంది.