విద్యార్థులకు అలర్ట్.. స్కూల్ టైమింగ్స్ మారాయ్
X
రాష్ట్రంలో పాఠశాలల పనివేళలను మారుస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాఠశాలలు ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. దీన్ని ప్రభుత్వం 9.30 గంటలకి విద్యాశాఖ మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రాథమిక పాఠశాలల సమయం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15వరకు మార్చింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 వరకు మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో నడిచే వాటికి కూడా ఇవే పనివేళలు వర్తిస్తాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని పాఠశాలల సమయాల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. చిన్నారులు ఉదయాన్నే నిద్రలేచి సమయానికి చేరుకోలేకపోతున్నారని, పైగా పాఠశాలలకు వేర్వేరు సమయాలు ఎందుకని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మా అభిప్రాయాలు అక్కర్లేదా..
అయితే పాఠశాలల పనివేళలను మార్చడం కరెక్ట్ కాదని పలు ఉపాధ్యాయ సంఘాలు విమర్శించాయి. నిపుణుల కమిటీని నియమించకుండా.. తల్లిదండ్రులు, టీచర్ల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు తాజా నిర్ణయం తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కావలి అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేశ్ డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాలలు కూడా ఉదయం 9.30 గంటలకే ప్రారంభమయ్యేలా విద్యాశాఖ చూడగలదా అని ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న ప్రశ్నించారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనివేళ్లల్లో మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పని వేళలు జంట నగరాలకు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించనున్నదని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో అధిక వర్షాలు కురవడంతో ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలకు కలిపి మూడు రోజులు సెలవులు ఇచ్చింది. ఆదివారంతో కలిసి నాలుగు రోజులు ఇచ్చినట్లయ్యింది.