మైనంపల్లికి రెండు టికెట్లపై కాంగ్రెస్లో చర్చ..!
X
తెలంగాణ కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఓ వైపు టికెట్ల హడావిడి, మరోవైపు నేతల చేరికలతో సందడి నెలకొంది. టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు రాగా .. స్క్రీనింగ్ కమిటీ వడపోతలో తలమునకలైంది. ఇప్పటికే 70 స్థానాల్లో కసరత్తు కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్లో చేరుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అంశంపై కాంగ్రెస్లో జోరు చర్చ నడుస్తోంది.
ఒకవేళ మైనంపల్లి కాంగ్రెస్లో చేరితే.. ఆయనకిచ్చే టికెట్ల అంశంపై కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. మైనంపల్లి తనతోపాటు తన కొడుకు రోహిత్ కు టికెట్ అడుగుతున్నారు. అయితే తండ్రి కొడుక్కి రెండు టికెట్లు ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా లేదని కొందరు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా ఉదయ్ పూర్ తీర్మానాన్ని పలువురు పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కుటుంబానికి ఒకటే టికెట్ ఇవ్వాలని ఉదయ్ పూర్లో కాంగ్రెస్ తీర్మానించింది. ఐదైళ్లు కాంగ్రెస్లో పనిచేసినవారికి మాత్రమే రెండో టికెట్ ఇవ్వాలని అప్పట్లో నిర్ణయించారు. దీంతో మైనంపల్లికి రెండు టికెట్ల అంశంపై సస్పెన్స్ నెలకొంది.
అటు రేఖానాయక్ ఫ్యామిలీపై సైతం ఉదయ్ ఫూర్ తీర్మానం ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. రేఖానాయక్ కూడా రెండు టికెట్లు అడుగుతోంది. తనతోపాటు తన భక్త శ్యామ్ నాయక్ కు టికెట్ ఇవ్వాలని కోరుతుంది. అయితే ఇద్దరికీ టికెట్లు సాధ్యం కాదంటున్న కాంగ్రెస్ చెప్పినట్లు తెలుస్తోంది. టికెట్లపై స్పష్టత రాకపోవడంతో రేఖానాయక్ ఢిల్లీలోనే ఉన్నట్లు సమాచారం.