Home > తెలంగాణ > వామ్మే.. వానలు ఇన్ని రకాలా.. వాటి పేర్లేంటో తెలుసా..?

వామ్మే.. వానలు ఇన్ని రకాలా.. వాటి పేర్లేంటో తెలుసా..?

వామ్మే.. వానలు ఇన్ని రకాలా.. వాటి పేర్లేంటో తెలుసా..?
X

వర్షం కొందరికి ఆనందాన్ని తీసుకొస్తే.. మరికొందరికి విషాదాన్ని మిగుల్చుతుంది. విత్తు మొలకెత్తాలంటే వాన.. ప్రకృతిపై ప్రేమ పుట్టాలంటే వాన అవసరం పడుతుంది. తొలకరి జల్లు పడినప్పటి నుంచి రైతులు బిజీ అయిపోతారు. మట్టికి అంకితం అయి.. నేచర్ తో కలిసి పోతారు. నాగలి భుజానేసి పొలాలకు బయల్దేరుతారు. దుక్కి దున్ని పంటలు వేస్తారు. వరుణ దేవుడికి మొక్కులు సమర్పిస్థారు. అందుకే రైతుకు వర్షానికి సంబంధం ఉందంటారు. అయితే.. ఒక్కో రకం వానకి ఒక్కో పేరుంది. పల్లెల్లో రైతులు వీటిని పిలుస్తుంటారు. వానల్లో కూడా రకాలు ఉంటాయా? అని ఆశ్చర్య పోతున్నారా? అవును వానలకు కూడా రకాలు ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 25 రకాల వానలు ఉన్నాయని పెద్దలు చెప్తున్నారు. ఆ వానల పేర్లోంటో వాటి అర్ధం తెలుసా..

వానల రకాలు:

1. గాంధారివాన - ఎదురుగా ఉన్నది కంటికి కనిపించనంత జోరుగా కురిసే వాన

2. మాపుసారివాన - సాయంత్రం సమయంలో కురిసే వాన

3. మీసరవాన - మృగశిరకార్తెలో కురిసే వాన

4. దుబ్బురువాన - తుప్పర లేదా తుంపర వాన

5. సానిపివాన - అలుకు (కళ్లాపి) జల్లినట్లు కురిసే వాన

6. సూరునీల్లవాన - ఇంటి చూరు నుండి ధార పడేంత వాన

7. బట్టదడుపువాన - ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన

8. తెప్పెవాన - చిన్న మేఘం నుంచి కురిసే వాన

8. సాలువాన - పొలంలో ఒక నాగలి సాలుకు సరిపడా వాన

10. ఇరువాలువాన - పంటల్లో రెండుసాల్లకు, విత్తనాలకు సరిపోయే వాన

11. మడికట్టువాన - పొలం బురదలా మారి దున్నేందుకు వీలున్న వాన

12. ముంతపోతవాన - ముంత (చెంబు)తో పోసినట్లు మోస్తరుగా కురిసే వాన

13. కుండపోతవాన - కుండతో కుమ్మరించినట్లు భారీ వాన

14. ముసురువాన - విడువకుండా చిన్న చిన్న చినుకులతో కురిసే వాన

15. దరోదరివాన - ఎడతెరపి లేకుండా కురిసే వాన

16. బొయ్య బొయ్యగొట్టేవాన - హోరుగాలితో కూడిన భారీ వాన

17. రాళ్లవాన - వడగండ్ల వాన

18. కప్ప దాటువాన - కొంతసేపు అక్కడక్కడా కురిసే వాన

19. తప్పడ తప్పడవాన - కొంతసేపు టపటపా కురిసే వాన.

20. దొంగవాన - రాత్రంతా కురిసి.. తెల్లావారి కనిపించని వాన

21. కోపులునిండేవాన - రోడ్డుపై గుంతలు నిండేంత వాన

22. ఏక్దారవాన - ఆగకుండా ఏకధారగా కురిసే వాన

23. మొదటివాన - విత్తనాలు మొలకెత్తేందుకు బలమిచ్చే వాన

24. సాలేటివాన - భూమి తడిసిపోయేంత భారీ వాన

25. సాలుపెట్టువాన - పొలం దున్నేందుకు సరిపోయే వాన


Updated : 21 July 2023 7:49 PM IST
Tags:    
Next Story
Share it
Top