నన్ను కాంట్రవర్సీల్లోకి లాగకు.. కేటీఆర్తో రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
X
అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సభకు వచ్చిన ఎమ్మెల్యేలంతా స్వపక్షం, ప్రతిపక్షమన్న తేడా లేకుండా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పలకరించారు. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. దానికి కేటీఆర్ లాగే తమకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని రాజగోపాల్ బదులిచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. బాగా పనిచేస్తే కీర్తి ప్రతిష్ఠలు వస్తాయని అన్నారు.
ఆ తర్వాత ఎంపీగా మీ కుమార్తె కీర్తి పోటీ చేస్తుందా లేక కొడుకు సంకీర్త్ బరిలో నిలుస్తాడా అని కేటీఆర్ ప్రశ్నించగా.. కోమటిరెడ్డి దయచేసి తనను కాంట్రవర్శీల్లోకి లాగొద్దని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ స్వయంగా బీజేపీలోకి పంపుతారన్న రాజగోపాల్ తనకు హోం మంత్రి అయి బీఆర్ఎస్ పార్టీ వాళ్లను జైలుకు పంపాలని ఉందంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం మీడియాతో చిట్ చాట్ చేసిన రాజగోపాల్ లోక్ సభ ఎన్నికల్లో తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని స్పష్టం చేశారు. పార్టీ ఎవరు పేరు ప్రకటించినా వారి గెలుపుకోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందన్న రాజగోపాల్.. పార్టీ హైకమాండ్ తనకు హామీ ఇచ్చిందని అన్నారు. తనకు హోం శాఖ ఇవ్వాలని కోరుకుంటున్నానని, అప్పుడే బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్ లో ఉంటారని అన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్న ఆయన.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.