హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 2 రోజులు నీళ్లు బంద్..
X
హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 3,4 తేదీల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. కృష్ణా వాటర్ సప్లై ఫేజ్–1పరిధిలోని సంతోష్ నగర్ వద్ద పైపులైన్ జంక్షన్ పనులకు మరమ్మతులు చేస్తున్న కారణంగా.. సిటీలోని పలు ప్రాంతాల్లో నీళ్ల సరఫరా బంద్ కానున్నట్టు మెట్రోవాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 3వ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు 4వ తేదీ గురువారం ఉదయం ఆరు గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా తాగునీటి సరఫరా ఫేజ్-1లోని సంతోష్ నగర్‌లో 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్ కోసం జంక్షన్ పనులు జరుగుతున్నాయి. SRDP పనుల్లో భాగంగా నల్గొండ-ఓవైసీ డౌన్‌ర్యాంప్ అలైన్‌మెంట్‌లోని సంతోష్‌నగర్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు. ఈ క్రమంలో మీరాలం, కిషన్ బాగ్, అల్జుబైల్ కాలనీ, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, ఆస్మాన్ గఢ్, యాకుత్ పురా, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్, రియాసత్ నగర్, అలియాబాద్, బొగ్గుల కుంట, అఫ్జల్ గంజ్, నారాయణ గూడ, అడిక్ మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలకలగూడ, దిల్ సుఖ్ నగర్ లోని పలు ప్రాంతాలు, బొంగుళూరు, మన్నెగూడ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు. వినియోగదారులు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.