సెల్ఫోన్లకు నో పర్మిషన్.. ఓటర్ల ఇబ్బందులు
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే జనం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చాలా మంది ఓటర్లు సెల్ ఫోన్లు వెంట తీసుకుని పోలింగ్ బూత్ లకు వెళ్తున్నారు. ఈఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ ఓటర్లకు అలర్ట్ జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు అనుమతి లేదని ప్రకటించింది.
సెల్‌ఫోన్లతో పాటు ఇతర గాడ్జెట్లకు పోలింగ్ స్టేషన్లలోకి తీసుకెళ్లేందుకు పర్మిషన్ లేదని ఈసీ స్పష్టంచేసింది. దయచేసి వాటిని తీసుకెళ్లొద్దని విజ్ఞప్తి చేసింది. ఓటేసే సమయంలో సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోలు తీయడాన్ని ఎలక్షన్ కమిషన్ నిషేధించింది. ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. నిబంధనలు ఉల్లంగించిన వారి ఓటు హక్కు రద్దుతో పాటు జైలుకు పంపే అవకాశముందని చెప్పింది.
ఇదిలా ఉంటే చాలా మంది ఓటర్లు సెల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. బూత్ లోకి వెళ్లిన తర్వాత పోలింగ్ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో ఓటు వేయకుండానే బయటకు రావాల్సి వస్తోంది. దీనిపై ఓటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.