ఓటేశాక సెల్ఫీ తీసుకోవచ్చు.. ఎక్కడంటే..
X
పోలింగ్ బూత్‌లో ఓటు వేశాక సెల్ఫీ తీసుకోవడం నేరం. కేసు పెట్టి ఓటును రద్దు చేస్తారు. అందుకే సెల్ఫీ వీరులు పోలింగ్ స్టేషన్ బయటకి వచ్చాక సిరా మరక పడిన వేలిని చూపుతూ సెల్ఫీలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో పోస్టుకుని మురిసిపోతుంటారు. అలాంటి సెల్ఫీ మోజున్న వారికి కోసం ఎన్నికల సంఘం కొన్ని వెసులుబాట్లు కల్పిస్తోంది. బూత్‌లో కాకుండా ఓటు వేసి వచ్చాక పోలింగ్ స్టేషన్ లోపలే సెల్ఫీ ముచ్చట తీర్చుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి 5 మోడల్, 5 మహిళా పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటు వేసి గది నుంచి బయటికి వచ్చాక సెల్ఫీ తీసుకోవడానికి అందమైన దృశ్యాలతో సెల్ఫీ పాయింట్‌ను తీర్చిదిద్దారు. కోనేరు, కోట బురుజు వంటి బొమ్మల దగ్గర ఓటర్ నిల్చుని సెల్ఫీ తీసుకోవచ్చు. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు. ఇలాంటి సెల్ఫీ పాయింట్లను ఈసీ ఇదివరకు కూడా చాలా చోట్లు ఏర్పాటు చేసింది.