Home > తెలంగాణ > రేపే కౌంటింగ్.. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

రేపే కౌంటింగ్.. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

రేపే కౌంటింగ్.. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం
X

అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 8.30 నుంచి ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారు.

కౌంటింగ్‌ కోసం మొత్తం 1,766 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతుంది. 500లకు పైగా పోలింగ్‌ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేశారు. దాదాపు 1.80 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌ ఉన్నారు. ఇదిలా ఉంటే ఉ.8.30 గంటలకల్లా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాకపోతే ఈవీఎంల లెక్కింపు సమాంతరంగా నిర్వహించనున్నారు. అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్‌ జరుగుతుంది. వారు ఓకే చెప్పిన తర్వాతే ఫలితాలు వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రతి టేబుల్‌కు ఒక మైక్రో అబ్జర్వర్ ను నియమించింది. మధ్యాహ్నానికి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశముంది.

Updated : 2 Dec 2023 3:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top