Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. 3 నుంచి ఈసీ కసరత్తు
X
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు షెడ్యూలు ప్రకారం జరుగుతాయా, లేకపోతే పార్లమెంటు ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారా అనే చర్చ ఒకపక్క నడుస్తుండగా మరోపక్క ఎన్నికల సంఘం తన పని తను చేసుకుపోతోంది. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన అధికారులు వచ్చే నెలలో రాష్ట్రంలో భారీ కసరత్తు చేపట్టనున్నారు. అక్టోబర్ 3 నుంచి ఈసీ ప్రత్యేక బృందం రాష్ట్రానికి రానుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
మూడు రోజులు ఈ పర్యటించనున్న బృందం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షిస్తుంది. రాజకీయ పార్టీలతో, ఉన్నతాధికారులతో చర్చిస్తుంది. తొలిరోజు గుర్తింపు పొందిన పార్టీలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. రెండో రోజు ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధతపై సమీక్ష ఉంటుంది. జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు నివేదికలు అందజేస్తారు. ఓటర్లకు సంబంధించి అంశాలపై చివరి రోజు సమీక్ష ఉంటుంది. తర్వాత విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడిస్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈసీ బృందం తెలంగాణకు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.