ఓట్ల డబ్బు తీసుకెళ్తున్న కారులో మంటలు.. ఎవడో వచ్చి..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డంతో డబ్బు పంపిణీ కూడా ఉపందుకుంది. 600 కోట్లకు పైగా సొమ్ము దొరికిందని పోలీసులు చెబుతున్నా దొరకని సొమ్ము వేలకోట్లలోనే ఉంటుందని భావిస్తున్నారు. డబ్బును ఏ మార్గంలో వీలైతే ఆ మార్గంలో తరలిస్తున్నారు. ఏ మాత్రం ఊహించిన ప్రదేశాల్లో దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. ఓ కారు ఇంజిన్‌లో దాచి తీసుకెళ్తున్న డబ్బు కట్టలు వెలుగు చూశాయి. ఇంజిన్ వేడెక్కి కట్టలకు మంటలు అంటుకోవడంతో బండారం బయటపడింది. వరంగల్ జిల్లాలో బొల్లికుంట క్రాస్ రోడ్స్ వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది.
కొందరు దండగులు కారు ఇంజిన్లో నోట్ల కట్టలు దాచి వరంగల్ నుంచి వర్ధన్నపేటకు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్‌రోడ్ దగ్గర కారులో మంటలు లేచాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్ కారు ఆపి పరారయ్యాడు. స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో మరోకారు అక్కడికొచ్చి ఆగింది. అందులోంచి ఓ వ్యక్తి దిగి కాలిపోతున్న నోట్ల కట్టలను సంచిలో వేసుకుని వెళ్లిపోయాడు. కారులో రూ. 30 లక్షల నగదు ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. సొమ్ము ఏ పార్టీ అభ్యర్థిదని కారు నంబరు, సీసీ ఫుటేజీల ఆధారంగా ఆరా తీస్తున్నారు. కావాలనే కారులో మంటలు పెట్టి ఉండొచ్చనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది.