Home > తెలంగాణ > నేటి నుంచి నామినేషన్ల పరిశీలన.. మొత్తం 4,798 మంది

నేటి నుంచి నామినేషన్ల పరిశీలన.. మొత్తం 4,798 మంది

నేటి నుంచి నామినేషన్ల పరిశీలన.. మొత్తం 4,798 మంది
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను ఇవాళ ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి 4,798 మంది 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా నారాయణపేటలో 13 మాత్రమే దాఖలయ్యాయి. వైరా, మక్తల్‌లో 19 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు స్క్రూటినీ చేసి అసలు బరిలో ఉండే అభ్యర్థుల లెక్కను తేల్చనుంది ఈసీ.

నామినేషన్లతోపాటు బీ ఫామ్ లు సమర్పించిన వారిని ఆయా పార్టీల అధికారిక అభ్యర్థులుగా గుర్తిస్తారు. బీ ఫామ్ లు ఇవ్వలేని వారిని స్వతంత్రులుగా పరిగణిస్తారు. ఈ నామినేషన్ల పరిశీలనకు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు అబ్జర్వర్లను నియమించింది ఈసీ. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. 67 మంది ఐఏఎస్‌ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించగా.. 39 మంది ఐపీఎస్‌ అధికారులు పోలీసు పరిశీలకులుగా బాధ్యతలు చేపట్టారు. మరో 60 మంది ఐఆర్‌ఎస్‌ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 166 మంది అబ్జర్వర్లు వివిధ జిల్లాలో నామినేషన్లు పరిశీలన చేపట్టనున్నారు.

ఈ ఎన్నికల కోసమని కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్థి రెండు, మూడు నామినేషన్లను దాఖలు చేశారు. పార్టీల తరపున వేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ముందస్తుగా నామినేషన్ వేశారు. దీంతో ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి అనేది తేలిపోనుంది. ఇక ఈ నెల 15వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు.

నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు ఈసీ నవంబర్ 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక బీఆర్‌ఎస్‌ 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 118 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఒక సీటును మిత్రపక్షమైన సీపీఐకి వదిలిపెట్టింది. బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేయగా, దాని మిత్రపక్షమైన జనసేన పార్టీకి 8 స్థానాలను వదిలిపెట్టింది. MIM తొమ్మిది స్థానాల్లో పోటీ చేయగా, మిగిలిన స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తోంది.

Updated : 13 Nov 2023 11:32 AM IST
Tags:    
Next Story
Share it
Top