Election Commission: ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు.. ఎలక్షన్ కమిషన్ కీలక సూచనలు
X
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటించింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లు, అభ్యర్థులను ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ఓటర్లు.. ఓటర్ గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 రకాల కార్డులను వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక ఓటర్లుకు ప్రత్యేక సౌకర్యాలు, ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ డాక్యుమెంట్లు ఉంటాయని చెప్పారు. ‘అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్ లో అన్ని కాలమ్స్ ను కచ్చితంగా నింపాలి. లేదంటే నామినేషన్ ను తిరస్కరిస్తారు. నమూనా, మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల అనుమతి లేదు. ప్రజలు ఏవైనా ఫిర్యాదులు ఉంటే 1950 టాల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలి. పార్టీ అభ్యర్థుల ప్రకటనలకు ఈసీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. బ్యాలెట్ లో పార్టీ గుర్తుతో పాటు, అభ్యర్థి ఫొటో కూడా ఉంటుంద’ని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో రాజకీయ నాయకుల ఫొటోలను తొలగించాలని తేల్చి చెప్పారు. ఓటర్ ఐడీ కోసం అక్టోబర్ 31 వరకు దనఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు.