Home > తెలంగాణ > హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు.. త్వరలోనే..

హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు.. త్వరలోనే..

హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు.. త్వరలోనే..
X

హైదరాబాద్ రోడ్లపై హైటెక్ ఎలక్ట్రిక్‌ బస్సులు తిరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మంచి ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది.





హైదరాబాద్‌లోని బస్ భవన్ ప్రాంగణంలో ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేసిన ఆయన.. వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ‘‘హైదరాబాద్కు తొలి దశలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రాబోతున్నాయి. వాటిలో 20 శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో తిరుగుతాయి. మరో 30 ఐటీ కారిడార్లో నడుస్తాయి. రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ ఆర్థిక ఏడాదిలో సిటీలో 500 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి వస్తాయి. అందులో 50 ఏసీ బస్సులుండగా.. మిగతావి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులున్నాయి’’ అని సజ్జనార్ తెలిపారు.





ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలివే..

12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. 35 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు సీటు బెల్ట్ సదుపాయం ఉంది. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బస్సు రివర్స్‌ చేసేందుకు వీలుగా రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా కూడా ఉంటుంది. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సులో నాలుగు ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్లు వెళ్తాయి.




Updated : 7 Aug 2023 3:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top