ఆలయాల ఆదాయం పెరగడానికి ఆ పథకమే కారణం - రేవంత్
X
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే అమలు చేస్తున్నామని చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆ స్కీం అమలు చూసి ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. అందుకే ఈ పథకంపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఫ్రీ బస్ సర్వీస్ స్కీంతో రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆదాయం గణనీయంగా పెరిగిందని రేవంత్ సభకు వివరించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడక ముందు నవంబర్ నెలలో ఎండోమెంట్ శాఖ ఆదాయం రూ. 49.27 కోట్లు ఉండేదని.. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత అది భారీగా పెరిగిందని అన్నారు. దేవాదాయ శాఖకు డిసెంబర్ నెలలో రూ. 93.27 కోట్లు, జనవరిలో రూ.69 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.
వాస్తవానికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత దేవాలయాల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహిళలకు టికెట్ అవసరం లేకపోవడంతో చాలా మంది పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆలయాల్లో రద్దీ డబుల్ అయింది. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయాలు వచ్చే ఆదాయం కూడా పెరిగింది.